హ‌రీశ్ రావు..అసైన్డ్ భూములను రిజిస్ట్రేష‌న్ చేయించుకుంటే ఎలా..?

నిప్పులు చెరిగిన రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

hellotelugu-PongletisrinivasReddy

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హరీశ్‌రావుపై రెవెన్యూ , స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌కు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అది తప్పేనని అన్నారు. అలాంటప్పుడు తన మామ భూముల విషయంలో రిజిస్ట్రేషన్‌ ఎలా జరిగిందని హరీశ్‌రావును ప్రశ్నించారు. అప్పుడు నీ బుద్ధి ఎక్కడికి పోయింది? అని వ్యాఖ్యానించారు. బుధ‌వారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. తన మామ భూములకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఎన్‌ఓసీ ఇచ్చిందన్న హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించారు. అసైన్డ్‌ భూములకు అనుమతి ఇవ్వడం చట్టబద్ధం కాదని, ఏ ప్రభుత్వం అలా చేసినా తప్పేనని పేర్కొన్నారు. ఆ విషయం హరీశ్‌రావుకు తెలియదా? అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి భూదాన్‌ భూమిని నకిలీ ఎన్‌ఓసీతో రిజిస్ట్రేషన్‌ చేయించు కున్నారని పొంగులేటి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అది కూడా తప్పేనని అన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ విషయంలోనూ నిషేధిత భూమి రిజిస్ట్రేషన్‌ జరిగిందని ఆరోపించారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్టేటస్‌కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ఏ సర్కార్‌ రిజిస్ట్రేషన్‌ చేసినా అది తప్పేనని స్పష్టం చేశారు. 22ఏ నిషేధిత జాబితాపైనా పొంగులేటి కీలక వివరాలు వెల్లడించారు. ఈ జాబితాలో ఉన్న భూముల్లో సుమారు నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే పట్టా భూములని, మిగిలిన భూమంతా ప్రభుత్వ భూమేనని బాంబు పేల్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ జాబితా నుంచి 47,440 ఎకరాలు తగ్గించినట్లు అసెంబ్లీలో ఇప్పటికే వెల్లడించిన‌ట్లు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై త్వరలోనే పూర్తి వివరాలు బయట పెడతామని పొంగులేటి చెప్పారు. 22ఏ భూముల వ్యవహారంపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయాలు తీసుకోనుందని అన్నారు.

Exit mobile version