విజయవాడ : హస్త కళలు, చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర హస్తకళలు, చేనేత వస్త్రాలను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ దిశగా స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తున్నారని తెలిపారు. ఎర్రచందనం కళాఖండాలు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని చెప్పారు. రాష్ట్రానికి లభించిన 34 క్లస్టర్లు, జాతీయ అవార్డులు, జీఐ ట్యాగ్‌లు మన కళల గొప్పతనానికి నిదర్శనమన్నారు. సాంకేతికంగా ఎంత ముందుకెళ్లినా పర్యావరణ హిత, సురక్షిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు చేనేత వస్త్రాలు ధరిస్తే కళాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.
నేటి యువతకు ఇక్కత్, కలంకారీ వంటి సంప్రదాయ కళలను పరిచయం చేస్తూ మన సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి కళాకారులు రూపొందించిన స్వామివారి విగ్రహాన్ని అమెరికాకు పంపగా విశేష ప్రశంసలు లభించడం మన కళాకారుల ప్రతిభకు గర్వకారణమని గుర్తుచేశారు.ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ పసుపులేటి హరి ప్రసాద్ మాట్లాడుతూ… ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మాటల్లోనే కాకుండా చేతల్లోనూ కళాకారుల పట్ల తన అభిమానాన్ని చాటుతున్నారని అన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హస్తకళల వస్తువులే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. హస్తకళలలో రాష్ట్రం గ్లోబల్ డెస్టినేషన్ గా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
చేనేత మరియు హస్తకళలు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ (చేనేత మరియు జౌళి) ల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా మాట్లాడుతూ… లేపాక్షి బ్రాండ్ టర్నోవర్ గత రెండేళ్లలో రూ.35 కోట్ల నుంచి రూ.60 కోట్లకు పెరిగటం దీని ప్రాధాన్యతను తెలియ జేస్తుందన్నారు. బొబ్బిలి వీణ వంటి ఉత్పత్తులు అంతర్జాతీయ గుర్తింపు పొందాయని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఈఆర్పీ ఆధారిత ఐటీ సొల్యూషన్ల ద్వారా వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్, మార్కెట్ ఇంటెలిజెన్స్, ఈ-కామర్స్ కార్యకలాపాలను ఆధునికీకరించామని తెలిపారు.
