GST : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా జీఎస్‌టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి సృష్టికి ప్రోత్సాహకరంగా మారనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, అమెరికా సుంకాల ప్రభావంతో ఎగుమతులు కుదేలవుతున్న నేపథ్యంలో దేశీయ వినియోగాన్ని పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు.
దేశంలో జీఎస్‌టీ (GST) అమలులోకి వచ్చిన తర్వాత ఇది తొలి పెద్ద సంస్కరణగా నిలిచింది. ఇప్పటివరకు ఉన్న పన్ను శ్లాబులను రెండు ప్రధాన శ్లాబులకు కుదించడం వల్ల సగటు వినియోగదారుడు కొనుగోలు చేసే అనేక వస్తువులు తక్కువ పన్నుతో లభిస్తాయని అధికారులు తెలిపారు. దీపావళి, దసరా పండుగల ముందు తీసుకున్న ఈ నిర్ణయం వినియోగాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థను ఉత్తేజింపజేస్తుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
GST – ఆటోమొబైల్ రంగానికి ఊరట
ఎంట్రీ లెవల్ టూ వీలర్లు, కార్లపై జీఎస్‌టీని 28% నుంచి 18%కు తగ్గించడంపై ఆటోమొబైల్ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ, “మేము ఎప్పటి నుంచో కోరుకున్న రేట్ల సవరణను ప్రభుత్వం సరైన సమయంలో చేసింది. ఇది వాహనాల డిమాండ్ పెరుగుదలకు తోడ్పడుతుంది” అని అన్నారు. అలాగే విడి భాగాలపై కూడా పన్ను తగ్గింపుతో పరిశ్రమకు ఊతమిస్తుందని ఆటోమోటివ్ కంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ACMA) పేర్కొంది.
ఎగుమతిదారులకు సహాయం
జీఎస్‌టీ (GST) రిఫండ్‌ల ప్రక్రియను ఒక వారంలో పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎగుమతిదారుల నిధుల కొరత సమస్య తగ్గుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. రూ.1,000 లోపు రిఫండ్‌లు అనుమతించడం ఇ-కామర్స్ ఎగుమతిదారులకు ఉపశమనం కలిగిస్తుందని ఆయన తెలిపారు.
రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల రంగాలకు బూస్ట్
సిమెంట్, స్టీల్ పై జీఎస్‌టీని (GST) 28% నుంచి 18%కు తగ్గించడం రియల్ ఎస్టేట్, మౌలిక రంగాల నిర్మాణ వ్యయాన్ని తగ్గిస్తుందని నరెడ్కో అధ్యక్షుడు, హీరానందిని గ్రూప్ చైర్మన్ నిరంజన్ హీరానందిని పేర్కొన్నారు. ముఖ్యంగా అందుబాటు గృహ ప్రాజెక్టులు తక్కువ ధరలో వినియోగదారులకు చేరతాయని ఆయన అన్నారు.
జీడీపీ వృద్ధికి మద్దతు
విశ్లేషకుల ప్రకారం, జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో దేశీయ వినియోగం పెరగడం వల్ల ఎగుమతుల తగ్గుదల ప్రభావం కొంతవరకు తీరవచ్చు. దీని ద్వారా జీడీపీ వృద్ధి రేటు స్థిరంగా ఉండే అవకాశం ఉందని అంచనా.
స్టాక్ మార్కెట్ ప్రతిస్పందన
తాజా సంస్కరణల ప్రభావంతో స్టాక్ మార్కెట్ గురువారం సానుకూలంగా స్పందించే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
చిన్న కార్ల ధరలు తగ్గనున్నాయి
జీఎస్‌టీ తగ్గింపుతో చిన్న కార్ల ధరలు 8–10% వరకు పడిపోవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఉదాహరణకు, మారుతి ఆల్టో K10 ధర రూ.4.23 లక్షల నుండి రూ.3.89 లక్షలకు, హ్యుందాయ్ గ్రాండ్ i10 ధర రూ.5.98 లక్షల నుండి రూ.5.51 లక్షలకు తగ్గవచ్చని అంచనా. రెనో క్విడ్ పై కూడా సుమారు రూ.40,000 తగ్గుదల రావచ్చని విశ్లేషకులు చెప్పారు.
Also Read : Today Gold Price : రోజు రోజుకి షాకిస్తున్న పసిడి ధరలు
