కెనడా : భారతదేశానికి అవసరమైన విశ్వసనీయ భాగస్వామిగా ఉండేందుకు కెనడా సిద్ధంగా ఉందని పేర్కొంది. సమగ్ర వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు ఐదవ విడత చర్చలు జరుపుతున్న నేపథ్యంలో, ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ ఉత్పత్తుల దీర్ఘకాలిక సరఫరాదారుగా కెనడా తనను తాను నిలబెట్టు కుంటోందని కెనడా ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటి, దీని వార్షిక వృద్ధి సుమారు 7 శాతం. కెనడా , భారతదేశం మధ్య నిజమైన వాణిజ్య , పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి, ఇవి ఇరువైపులా వ్యాపారాలకు , కార్మికులకు మద్దతు ఇస్తాయి” అని గ్లోబల్ అఫైర్స్ కెనడా ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. ఈ వారం కెనడా , భారత ప్రతినిధులు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దిశగా 5వ విడత చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.
2026 చివరి నాటికి చర్చలను ముగించాలని కెనడా, భారత్ లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెండు వారాల క్రితం మంత్రి సిధు ముంబై పర్యటన, జీ20 సదస్సులో మంత్రి గోయల్‌తో జరిపిన చర్చల ఊపును కొనసాగిస్తూ ఈ చర్చలు జరుగుతున్నాయి అని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిందర్ సిధు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌లను ప్రస్తావిస్తూ గ్లోబల్ అఫైర్స్ కెనడా పేర్కొంది. గత వారం మిల్వాకీలో జరిగిన జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఈ ఇద్దరు మంత్రులు సమావేశమయ్యారు. ప్రస్తుత రౌండ్‌కు ముందు సీఈపీఏ చర్చలలో సాధించిన పురోగతిపై వారు చర్చించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన వాణిజ్య, పెట్టుబడుల ఫోరమ్‌కు సిధు, గోయల్‌కు, పెద్ద భారతీయ వ్యాపార ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు సాధించిన పురోగతిని కొనసాగిస్తూనే ఈ తాజా చర్చలు జరుగుతున్నాయని కెనడా ప్రభుత్వం తెలిపింది.
