GST : భారత్‌లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా ప్రతి రోజు కోట్లాది రూపాయల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. దేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా యూపీఐ పేమెంట్లు చేస్తున్న దేశంగా నిలిచింది. ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలను విధించని ప్రభుత్వం, భవిష్యత్తులో పరిస్థితులు మారవచ్చన్న అంశంపై చర్చలు మొదలవుతున్నాయి.
GST – UPI Updates
ఈ నేపథ్యంలో, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపాయి. “డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను కొనసాగించాలంటే ఖర్చు తప్పదు. ఉచిత సేవలు శాశ్వతంగా ఉండకపోవచ్చు” అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించవచ్చన్న అంచనాలు పుట్టుకొచ్చాయి.
సోషల్ మీడియాలోతో పాటు కొన్ని మీడియా నివేదికల్లో, రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ (GST) విధించే అవకాశం ఉందని కథనాలు వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
జీఎస్టీ విధించే ఉద్దేశం లేదన్న కేంద్రం
వర్షాకాల సభల్లో రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ, రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఈ కథనాలు వాస్తవానికి దూరమని, కేంద్రం ఇలాంటి ప్రతిపాదనను పరిశీలించడంలేదని ఆయన తెలిపారు.
జీఎస్టీ కౌన్సిల్ నుంచి సిఫార్సు లేదన్న స్పష్టత
జీఎస్టీ కౌన్సిల్ నుంచి రూ. 2,000 పైగా లావాదేవీలపై ట్యాక్స్ విధించాలన్న సూచన కూడా రాలేదని పంకజ్ చౌదరి వివరించారు. జీఎస్టీకి సంబంధించిన అన్ని నిర్ణయాలు కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగానే తీసుకుంటామని, దీనిలో కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు భాగస్వాములని చెప్పారు.
ప్రభుత్వ ఆదాయంపై ఎలాంటి ప్రభావం లేదన్న కేంద్రం
ప్రస్తుతం కేంద్ర ఆదాయంలో ఎలాంటి క్షీణత లేదని మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లక్ష్యాలను సాధించడంపై ప్రభుత్వ దృష్టి కేంద్రీకరించబడిందని తెలిపారు. అంచనా ప్రకారం, 2025-26లో ఆర్థిక లోటు రూ. 15.69 లక్షల కోట్లుగా ఉండనుందని, ఇది జిడిపిలో 4.4 శాతంగా ఉంటుందని వివరించారు.
బ్యాంకు ఉద్యోగుల నియామకాలపై వివరాలు
బ్యాంకుల్లో ఉద్యోగుల పరిస్థితిపై వచ్చిన మరో ప్రశ్నకు స్పందిస్తూ, 2025 మార్చి 31 నాటికి బ్యాంకులలో 96 శాతం ఉద్యోగులు అవసరమైన స్థానాల్లో పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. పదవీ విరమణ, రాజీనామాల కారణంగా కొంత మంది ఉద్యోగులు తగ్గినా, గత ఐదేళ్లలో 1.48 లక్షల మందికి పైగా నియామకాలు జరిగాయని, ప్రస్తుతం 2025-26 లో మరో 48,570 మందిని నియమించనున్నారు అని వెల్లడించారు.
Also Read : Today Gold Price : భారీ రేట్ల నుంచి నెమ్మదిగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు
