GST : దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయ వసూళ్లు ఈ ఏడాది ఆగస్టులో గణనీయంగా పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన 6.5% వృద్ధితో స్థూల వసూళ్లు రూ.1.86 లక్షల కోట్లను దాటాయి. దేశీయ వ్యాపార లావాదేవీలు పుంజుకోవడం, పండగ సీజన్ ప్రారంభం కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు.
అయితే, గత జూలైలో నమోదైన రూ.1.96 లక్షల కోట్ల వసూళ్లతో పోలిస్తే ఆగస్టు వసూళ్లు కొంత తగ్గాయి. అయినప్పటికీ, మొత్తం వృద్ధి ధోరణి కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
GST – దేశీయ, దిగుమతుల వసూళ్లు
ఆగస్టులో దేశీయ ఆర్థిక లావాదేవీల నుంచి వసూలైన స్థూల పన్ను ఆదాయం 9.6% పెరిగి రూ.1.37 లక్షల కోట్లకు చేరింది. అయితే దిగుమతులపై వసూళ్లు 1.2% తగ్గి రూ.49,354 కోట్లకు పరిమితమయ్యాయి.
రిఫండ్ల పరిస్థితి
జీఎస్‌టీ (GST) రిఫండ్లు ఈ నెలలో గణనీయంగా తగ్గాయి. ఆగస్టులో రిఫండ్లు 20% తగ్గి రూ.19,359 కోట్లుగా నమోదయ్యాయి. అందులో ఎగుమతుల రిఫండ్లు రూ.8,346 కోట్లకు తగ్గడం సుంకాల ఒత్తిడిని సూచిస్తోందని ఈవై ట్యాక్స్ పార్ట్‌నర్ సౌరభ్ అగర్వాల్ విశ్లేషించారు.
రిఫండ్ల అనంతరం ఆగస్టు నెలలో జీఎస్‌టీ నికర ఆదాయం రూ.1.67 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన నికర ఆదాయంతో పోలిస్తే 10.7% అధికం.
పండగ సీజన్ ప్రభావం
డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ ఎం.ఎస్. మణి మాట్లాడుతూ, “పండగ సీజన్ కారణంగా డిమాండ్ వృద్ధి నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే, ప్రతిపాదిత జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో వసూళ్లు కొంత తగ్గవచ్చు” అని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
- ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెలలో జీఎస్టీ ఆదాయం 21% పెరిగి రూ.3,989 కోట్లకు చేరింది.
- తెలంగాణలో వసూళ్లు 12% వృద్ధితో రూ.5,103 కోట్లకు పెరిగాయి.
Also Read : Today Gold Price : ఎప్పుడు లేని రికార్డు సృష్టించిన పసిడి ధరలు
