తిరుపతి : తిరుపతి, తిరుచానూరు, కపిలతీర్థం, నారాయణవనం తదితర టీటీడీ స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి వేడుకలు వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినాన్ని పురస్కరించుకుని స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, స్నపన తిరుమంజనం, వీధి ఉత్సవాలు, గోపూజ, గోకులాష్టమి ఆస్థానం తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణ స్వామి వారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా మూలమూర్తులకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 6.45 గంటలకు శ్రీకృష్ణ స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గోపూజ, గోకులాష్టమి ఆస్థానం నిర్వహించారు.
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, అనంతరం ఊంజల్‌సేవ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారికి ఉట్లోత్సవం, ఆస్థానం చేపట్టారు. తిరుపతి లోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీకృష్ణ స్వామి వారికి అభిషేకం, పురాణ పఠనం, ఆస్థానం నిర్వహించారు . శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వేణు గోపాల స్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారి వీధి ఉత్సవం వైభవంగా జరిగింది. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహించారు.
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివా రిని మేల్కొలిపి తోమాలసేవ, పంచాంగ శ్రవణం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి 6.40 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి వారికి అభిషేకం నిర్వహించి, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన చేపట్టారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాలసేవ, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణ స్వామి వారి వీధి ఉత్సవం, సాయంత్రం 5 గంటలకు ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించారు.
