భక్తుల ప్రశాంత దర్శనమే టీటీడీ ప్రధాన లక్ష్యం

అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని విన్న‌పం

hellotelugu-TTd

తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన, ప్రశాంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ నిరంతరం పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతోంది. సర్వదర్శనం, నిర్దేశిత సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వర్చువల్ సేవలు, ఎన్‌ఆర్‌ఐలు, ఇతర ప్రత్యేక దర్శనాలకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలపై భక్తులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తోంది. ఇటీవల కాలంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పరిమితికి మించి పెరుగుతున్నప్పటికీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తోంది .ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు వంటి విశేష పర్వదినాల్లో భారీగా తరలివచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోంది. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ నుంచి భక్తులకు కేటాయించిన సమయానికి శ్రీవారి దర్శనం కల్పించే వరకు అన్ని విభాగాలు సమిష్టిగా, ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నాయి. భక్తుల రద్దీ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, అన్నప్రసాదం, భద్రత తదితర సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

అధికారులు, ఉద్యోగులతోపాటు భద్రత, విజిలెన్స్, అన్నప్రసాదం, తాగునీటి విభాగాలు, శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు విశేష సేవలు అందిస్తున్నారు. నిర్దేశిత సర్వదర్శనంపై భక్తులకు అవగాహన కల్పిస్తూ, భక్తుల భద్రత దృష్టిలో పెట్టుకొని సమయానుకూలంగా టిటిడి నిర్ణయాలు చేపడుతోంది. శ్రీవారి దర్శనం, వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తామని భక్తులను మోసం చేసే దళారులపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటోంది. దర్శనం, గదుల కేటాయింపు పేరుతో మోసాలకు పాల్పడిన దళారులపై ఈ సంవత్సరం ఇప్పటి వరకు 30 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. అంతే కాకుండా ఈ సంవత్సరం ఇప్పటివరకు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన 43 మంది ఉద్యోగులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఎవరైనా సరే – దళారులైనా, సిబ్బందైనా రాజీలేని కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ స్పష్టం చేస్తోంది.

అదేవిధంగా గదుల కేటాయింపు పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనలు, పోస్టర్లు, తప్పుడు హామీలతో భక్తులను మోసగిస్తున్న 249 నకిలీ (ఫేక్) వెబ్‌సైట్‌లను ఈ సంవత్సరం ఇప్పటి వరకు టీటీడీ గుర్తించింది. వీటిపై 02 క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, సంబంధిత సంస్థల సహకారంతో ఆ వెబ్‌సైట్‌లన్నింటినీ తొలగించడం జరిగింది. ఆన్‌లైన్‌లో టీటీడీ పేరుతో కనిపించే నకిలీ వెబ్‌సైట్‌లు, లింక్‌ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరిస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులు వాహనాల్లో నిషేధిత వస్తువులను తరలించకుండా అలిపిరి, శ్రీవారిమెట్టు తనిఖీ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. నిషేధిత వస్తువులు గుర్తించిన సందర్భంలో అలిపిరి టోల్‌గేట్ స్కానింగ్ కేంద్రం వద్దనే వాటిని సీజ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు అలిపిరి వద్దనే 261 డ్రోన్లు, 105 మెటా స్మార్ట్ గ్లాసెస్‌ను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. పవిత్ర తిరుమల క్షేత్రంలో భద్రత, గోప్యత దృష్ట్యా డ్రోన్లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి రికార్డింగ్ పరికరాలు పూర్తిగా నిషేధమని, వీటిని తీసుకు రావద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

శ్రీవారి దర్శనం, వసతి, సేవలు, టోకెన్లు తదితర అంశాల్లో దళారులను నమ్మి భక్తులు మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు, నిబంధనలు, మార్గదర్శకాలపై అధికారిక టీటీడీ సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచిస్తోంది. భక్తులను అప్రమత్తం చేసేందుకు టీటీడీ సామాజిక మాధ్యమాలు, ఎస్‌వీబీసీ, ప్రజా సంబంధాల విభాగాల ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులు టీటీడీ సూచనలు, నిబంధనలు పాటిస్తూ సహకరించాలని టీటీడీ కోరుతోంది. భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో శ్రీవారి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Exit mobile version