తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు రాత్రి ధ్వజావరోహణ ఘట్టంతో విజయవంతంగా ముగిశాయి. రాత్రి 8.40 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజావరోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ఆరంభంలో ధ్వజారోహణం ద్వారా ఆహ్వానించిన సకల దేవతలను గరుడ పటాన్ని అవనతం చేసి ఘనంగా సాగనంపారు
బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని సేవించిన భక్తులు సమస్త పాపాల నుండి విముక్తి పొంది, ఆయురారోగ్యాలు, ధనధాన్య సమృద్ధి, సకల శుభఫలాలను పొందుతారని ఆగమ, పురాణాలు విశదీకరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో నారాయణ చౌదరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ, అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులు సంతోషం వ్యక్తం చేశారు ఏర్పాట్లపై.
ఏ ఒక్క భక్తుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా గత ఏడాది కంటే ఈసారి నిర్వహించిన శ్రీ గోవింద రాజస్వామి వారి బ్రహ్మోత్సవాలకు భారీగా తరలి వచ్చారు భక్తులు. మరో వైపు టీటీడీ సీఎం ఆదేశాల మేరకు తిరుమలతో పాటు అనుబంధ ఆలయాలలో కూడా అన్నదానం కార్యక్రమం చేపట్టే పనిలో పడ్డారు.



















