అమరావతి : సంక్షేమం తమ కూటమి సర్కార్ లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. గత జగన్ రెడ్డి సర్కార్ హయాంలో పల్లెల గురించి పట్టించు కోలేదని ఆవేదన చెందారు. తాము కొలువు తీరాక అన్ని వర్గాల సంక్షేమానికి ప్రయారిటీ ఇచ్చామన్నారు. జగన్ గద్ద పంచాయతీ నిధులు తన్నుకెళ్లిపోయిందని సంచలన ఆరోపణలు చేశారు . దీని కారణంగా గ్రామాల్లో అభివృద్ధి నిలిచి పోయిందన్నారు. తాము వచ్చాక గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తోందన్నారు. దీనివల్ల పంచాయతీల్లో అభివృద్ధి పనులు జోరందుకున్నాయని చెప్పారు మంత్రి సవిత. పెనుకొండ నియోజకవర్గంలో పలు పనులకు శ్రీకారం చుట్టారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు ఎస్. సవిత. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందజేస్తోందని చెప్పారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఇసుక, ఫ్రీ బస్, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, అన్న క్యాంటీన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు. కియా పరిశ్రమ ఏర్పాటుతో తమ బిడ్డలకు ఉపాధి లభిస్తోందని, వలస వెళ్లాల్సిన దుస్థితి తప్పిందని సానిపల్లి గ్రామస్తులు ఆనందం వెలిబుచ్చినట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.
