అమరావతి : వర్జీనియా పొగాకు రైతుల సమస్యల పరిష్కారంలో కూడా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిపై కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ వెంటనే స్పందించి, పొగాకు కొనుగోలు చేస్తున్న అన్ని కంపెనీలకు రైతుల వద్ద ఉన్న మొత్తం వర్జీనియా పొగాకు పంటను కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఎఫ్ సీ వీ పొగాకు రైతులను ఖచ్చితంగా అదుకుంటామని, కేంద్ర మంత్రి ఆదేశాలకు కంపెనీలు కూడా సానుకూలంగా స్పందించి రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపాయని చెప్పారు. జగన్ సిండికేట్‌ల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. నీ పాలనంతా దోచుకోవడం, దాచుకోవడం, సిండికేట్ రాజకీయాలకే పరిమితమైనందున అందరూ అలాగే వ్యవహరిస్తారని భ్రమపడుతున్నావు అని ఎద్దేవా చేశారు.
అదే నీ రాజకీయ ఆలోచనా విధానానికి నిదర్శనం. రైతుల ప్రయోజనాల కోసం పారదర్శకంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలి అని సూచించారు అచ్చన్నాయుడు. వర్జీనియా పొగాకు ధరల పతనం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదు. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గుదల, ఎగుమతులపై ఏర్పడిన ప్రతికూల ప్రభావం, దేశీయంగా జీఎస్‌టీ పెరుగుదల వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలే దీనికి ప్రధాన కారణాలు. ఈ వాస్తవాలను తెలిసినా ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం జగన్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం అన్నారు.
రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం కంటే, ఐదేళ్ల నీ పాలనలో పొగాకు రైతుల కోసం ఏం చేశావో ప్రజలకు చెప్పడం మంచిదన్నారు అచ్చెన్నాయుడు. ఇప్పుడు రైతుల సంక్షేమంపై నీతులు చెప్పడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నావా? లేక తెలిసే రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారం చేస్తున్నావా? అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోందని అని అన్నారు. రైతుల కష్టాలను రాజకీయాలకు వాడుకోవడం మానేసి, నిజాలను అంగీకరించే ధైర్యం చూపాలని గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్‌కు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.
