హైదరాబాద్ : హైదరాబాద్‌లోని తెలంగాణ బార్ కౌన్సిల్ ప్రాంగణంలో ఈరోజు జరిగిన నమోదు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొత్తం 774 మంది న్యాయశాస్త్ర పట్టభద్రులు తెలంగాణ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదులుగా నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు మాజీ న్యాయమూర్తి , తెలంగాణ లోకాయుక్త ఛైర్మన్ జస్టిస్ రాజా శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన కొత్తగా నమోదు చేసుకున్న న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారి వృత్తి జీవితమంతా నిరంతర అభ్యసనం , తమ న్యాయ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నవీకరించుకోవడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. యువ న్యాయవాదులు అభ్యసనానికి కట్టుబడి ఉండాలని అన్నారు. న్యాయశాస్త్రంలో వస్తున్న తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ సామల రామిరెడ్డి, ఉపాధ్యక్షుడు చాలకని వెంకట్ యాదవ్, బార్ కౌన్సిల్ సభ్యుడు జి. కిరణ్ కుమార్ ల సమక్షంలో న్యాయవాదులుగా నమోదు చేసుకున్నారు. కొత్తగా చేరిన న్యాయవాదులను ఉద్దేశించి తెలంగాణ బార్ కౌన్సిల్ అధ్యక్షులు రామి రెడ్డి మాట్లాడుత న్యాయవాద వృత్తిని అభ్యసించేటప్పుడు న్యాయవాద వృత్తి గౌరవాన్ని, మర్యాదను కాపాడుకోవడం అత్యవసరం అని నొక్కి చెప్పారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు చాలకని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ యువ న్యాయవాదులు అడ్వకేట్స్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, న్యాయవాద వృత్తిని నియంత్రించే నియమాలకు కట్టుబడి ఉండాలని కోరారు.
భారత బార్ కౌన్సిల్ సభ్యులు జి. కిరణ్ కుమార్ కీలక సూచనలు చేశారు. క్రమశిక్షణ, అంకితభావం మరియు వృత్తిపరమైన నైతిక విలువల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఒక న్యాయవాది వృత్తి జీవితంలో మొదటి మూడు నుండి ఐదు సంవత్సరాలు చాలా కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. ఈ కాలాన్ని తమ న్యాయ పరిజ్ఞానాన్ని పటిష్టం చేసుకోవడానికి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి, సీనియర్ న్యాయవాదుల నుండి నేర్చుకోవడానికి , విజయవంతమైన వృత్తి జీవితానికి బలమైన పునాది వేసుకోవడానికి ఉపయోగించుకోవాలని యువ న్యాయవాదులకు ఆయన సలహా ఇచ్చారు.
