చెన్నై : తమది మాటల సర్కార్ కాదని చేతల ప్రభుత్వం అని ఇప్పటికే నిరూపించుకున్నారు సీఎం విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్. ఆయన 100 రోజులలో ఏకంగా రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు వచ్చారు. రాబోయే కాలంలో ట్రిలియన్ డాలర్ల ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కీలకమైన పథకం నవజాత శిశువులకు బంగారు ఉంగరాల స్కీం. ఇక ఉంగరాల తయారీకి సంబంధించి ఇద్దరు బంగారు ఆభరణాల తయారీకి ఆదేశాలు జారీ చేసింది టీవీకే సర్కార్. తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లబ్ధిదారులకు అవసరమైన 1,28,499 బంగారు ఉంగరాలను సరఫరా చేయడానికి జాయ్ అలుక్కాస్ , కళ్యాణ్ జ్యువెలర్స్‌కు 70:30 నిష్పత్తిలో పని ఆదేశాలను జారీ చేసింది.
నవజాత శిశువుల కోసం ఉద్దేశించిన మేనమామ బంగారు ఉంగరం పథకం కింద బంగారు ఉంగరాలను సేకరించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇద్దరు జ్యువెలర్లకు పని ఆదేశాలు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి సి.ఎన్. అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి జూన్ నుండి సెప్టెంబర్ వరకు లబ్ధిదారులకు అవసరమైన బంగారు ఉంగరాలను సరఫరా చేయనుంది. ప్రభుత్వ వైద్య కేంద్రాలలో ప్రసవాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించిన ఈ పథకం, ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన పిల్లలకు వర్తిస్తుంది. ఒక గ్రాము బరువున్న 4,41,667 బంగారు ఉంగరాలను సరఫరా చేయాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు, జూలై 14న తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ నిర్వహించిన టెండర్‌లో 11 కంపెనీలు పాల్గొని, టీఎన్ టెండర్స్ పోర్టల్ ద్వారా తమ ధరల వివరాలను సమర్పించాయి అని తెలిపింది.
