పంజాబ్ సీఎం భార్య‌పై హ‌క్కుల క‌మిష‌న్ కు ఫిర్యాదు

అత్యాచార కేసును అణ‌చి వేసేందుకు రూ. 5 కోట్లు డిమాండ్

hellotelugu-NHRC

న్యూఢిల్లీ : పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ భార్య‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్ హెచ్ ఆర్ సీ). అత్యాచార కేసును అణచి వేసేందుకు పంజాబ్ సీఎం భార్య రూ. 5 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. ఈ ఆరోపణలను పంజాబ్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని ఎన్ హెచ్ ఆర్ సీ ధర్మాసనం, ఈ వ్యవహారంపై విచారణ జరిపి రెండు వారాల్లోగా తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని , డీజీపీని ఆదేశించింది. అలాగే, ఈ విషయాన్ని భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖలోని మహిళా భద్రతా విభాగంకు కూడా కమిషన్ పంపింది. ఆ నివేదిక ఆధారంగా కమిషన్ తదుపరి చర్యలు తీసుకుంటుంది. అంతకు ముందు, ఆగస్టు 19న, పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్స‌వ‌ వేడుకలు నిర్వహించక పోవడంపై వచ్చిన ఫిర్యాదును కూడా ఇదే ధర్మాసనం పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వం నుండి సమగ్ర నివేదికను కోరింది.

గ్రామీణ, మారుమూల , సరిహద్దు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగలేదని, దీనివల్ల అక్కడి పిల్లలకు జాతీయ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కలేదని ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పిల్లలకు లభించిన విద్యా, సాంస్కృతిక , పౌరపరమైన అవకాశాలు సరిహద్దు, మారుమూల ప్రాంతాల పిల్లలకు కూడా లభించాయా లేదా అని పరిశీలించాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర, జిల్లా ,పాఠశాలల వారీగా వివరాలను అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరారు; ఇందులో జాతీయ జెండా ఎగురవేసిన, జాతీయ గీతం ఆలపించిన , విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య వంటి వివరాలు ఉండాలని స్ప‌ష్టం చేసింది జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్. నిర్దేశించిన కార్యక్రమాలను నిర్వహించని పాఠశాలలను గుర్తించి, ఆ నిబంధనల ఉల్లంఘనకు గల కారణాలను వివరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Exit mobile version