కోల్ కతా : అంతర్జాతీయ వాటర్ బాటిళ్ల తయారీ సంస్థ బిస్లరీ కంపెనీకి బిగ్ షాక్ తగిలింది . కంపెనీకి చెందిన పశ్చిమ బెంగాల్ ప్లాంట్ నుండి సేకరించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనా నాణ్యతా పరీక్షలో విఫలమైన నేపథ్యంలో బిస్లరీ ఇంటర్నేషనల్పై విచారణ చర్యలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆమోదం తెలిపిందని వర్గాలు తెలిపాయి. ప్రయోగశాల విశ్లేషణలో ఆ నమూనాలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించడంతో, నీటి భద్రతపై ఆందోళనలు తలెత్తాయి. మురుగు నీటి కాలుష్యం, లీకవుతున్న పైప్లైన్లు, దెబ్బతిన్న నీటి మౌలిక సదుపాయాలు వంటి ఇతర మార్గాల ద్వారా ఇటువంటి బ్యాక్టీరియా నీటి సరఫరాలోకి ప్రవేశిస్తుందని తెలిపింది.
భారతదేశంలోని ప్రధాన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీలలో ఒకటైన బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎఫ్ఎస్ఎస్ఏఐ విచారణకు ఆమోదం తెలపడం ఇది రెండోసారి. కంపెనీకి చెందిన గోవా ప్లాంట్ నుండి సేకరించిన నీటి నమూనా ప్రయోగశాల పరీక్షలో విఫలమైన తర్వాత ఆహార నియంత్రణ సంస్థ ప్రకటించిన చర్యల తర్వాత ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లో, జల్పాయిగురి జిల్లాలోని టెలిపారా గ్రామంలో ఉన్న బిస్లరీ ప్లాంట్ నుండి ఈ నమూనాను సేకరించారు.
ప్రాథమిక, రెఫరల్ ప్రయోగశాలలు రెండూ నీటి నమూనాలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారించాయి. ఈ ఫలితాల నేపథ్యంలో, PB 201గా గుర్తించ బడిన ఒక నిర్దిష్ట బ్యాచ్ అమ్మకాలను ఆగస్టు 12న ఆహార తనిఖీ సంస్థ నిషేధించింది. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ బిస్లరీ ఇంటర్నేషనల్పై ప్రాసిక్యూషన్ చర్యలకు అథారిటీ ఇప్పుడు ఆమోదం తెలిపింది. దీనిపై బిస్లరీ ఇంటర్నేషనల్ నుండి ఎటువంటి స్పందన రాలేదు.



















