అమరావతి : నేతన్నలకు ఉచిత విద్యుత్ సరఫరా హామీని నెరవేర్చామని మంత్రి సవిత తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 50,565 చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామన్నారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు అందిస్తున్నామన్నారు. మగ్గం నేతన్నలకు నెలకు రూ.720లు, ఏడాదికి రూ. 8,640లు, మరమగ్గం నేతలన్నలకు నెల రూ.1,860లు, ఏడాదికి రూ.21,600లు లబ్ధి కలుగుతోందన్నారు. ఉచిత విద్యుత్ పథకం కోసం రూ.150 కోట్లు వెచ్చిస్తున్నామని, ఈ పథకం అమలుతో నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నిండాయని మంత్రి సవిత తెలిపారు. చేనేత కార్మికులకు ఆర్థిక పరిపుష్టి లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. చేనేత కార్మికులకు రంగులు వేయడం, బ్లీచింగ్ ఛార్జీలు వేతనాలు పెంచామన్నారు. 90 శాతం సబ్సిడీతో మగ్గం పనిముట్లు అందజేస్తున్నామన్నారు.
చేనేత కార్మికుల గుర్తింపు కార్డులు ఇస్తున్నామని, వస్త్రాలకు క్యూఆర్ కోడింగ్ ఇచ్చి… నేతన్నల కష్టం, వస్త్రం తయారీ గురించి తెలిపేలా ఆ కోడ్ లో పేర్కొంటున్నామని తెలిపారు. ఈ కోడింగ్ తో నకిలీ వస్త్రాల అమ్మకాలకు అడ్డుకట్టపడుతోందన్నారు. నేతన్నలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. రూ.10.44 కోట్లతో 10 చిన్న క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా చేనేత క్లస్టర్ నిర్మిస్తున్నామని తెలిపారు ఎస్. సవిత. అమరావతిలో చేనేత, హస్తకళల మ్యూజియం నిర్మించబోతున్నామని వెల్లడించారు. పిఠాపురంలోని ఉప్పాడలో రూ.15.01 కోట్లు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ ప్రాజెక్టుకు రూ.22.50 కోట్లతో చేనేత పార్క్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమరావతిలోని శాఖమూరులో పది ఎకరాల విస్తీర్ణంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) ఏర్పాటుకు నిర్ణయించామన్నారు.
7 వేల మంది చేనేతలకు రూ.65.35 కోట్లు ముద్ర రుణాలు మంజూరు. నేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ఆద్యం, టాటా తనేరియా, కో ఆప్టెక్స్ వంటి సంస్థలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంతో కూడా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. చేనేత వస్త్రాలు, హస్త కళారూపాలు ఒకే చోట విక్రయించేలా షో రూమ్ లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. చేనేత కుటుంబాలు గౌరవమైన, ఆర్థిక భరోసాతో కూడిన జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు
