బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో తాము ఒక కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశామన్నారు. దానికి ఒక మంత్రిని బాధ్యులుగా నియమిస్తామని వెల్లడించారు. ఈ ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని తెలిపారు. మంత్రులందరూ వారానికి ఒక రోజు తప్పనిసరిగా ఏదో ఒక తాలూకాకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అక్కడ వారు ప్రజలను కలిసి వారి సమస్యలను పరిశీలించాలని అన్నారు.
ప్రజలు సమస్యల పరిష్కారం కోసం బెంగళూరుకు రావాల్సిన పరిస్థితిని మనం రానివ్వకూడదని అందుకే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు సీఎం డీకే శివకుమార్. దీనిని ‘ప్రజా సేవక్ శాఖ’ (Praja Sevak Department) అని పిలుస్తామని అన్నారు. అలాగే, ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఇంటికీ వెళ్లేలా నేను చూస్తానని అన్నారు సీఎం. దీనికి ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని బాధ్యులుగా నియమిస్తామని వెల్లడించారు . వారితో పాటు ఇతర అధికారులు కూడా ఉంటారని చెప్పారు. సివిల్ సర్వెంట్ ఆశావహుల కోసం ఢిల్లీలో మరో కర్ణాటక భవన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా వసతిలో కనీసం 50 శాతం ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు రిజర్వ్ చేయనున్నట్లు, మిగిలిన సీట్లను ఇతర వర్గాల అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు సీఎం తెలిపారు. ఢిల్లీలో రిటైర్డ్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులను నియమించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు డీకే శివకుమార్. అలాగే సుప్రీంకోర్టు కేసులను నిర్వహించడానికి జాతీయ రాజధానిలో ఒక ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.
