అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 4 వేల మందికి పైగా ఉన్న చేనేతన్నల కుటుంబాల కోసం నూతనంగా ఉచిత విద్యుత్ పథకానికి ఇవాల్టి నుంచి శ్రీకారం చుట్టింది. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ పథకం కింద ప్రతి బడ్జెట్ లోనూ రూ.5 కోట్లు చొప్పున్న కేటాయిస్తూ వస్తున్నారు. క్యాష్ క్రెడిట్ కార్డులతో సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నారు. స్మాల్ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం (ఎస్.డి.పి.) కింద 10 చిన్న క్లస్టర్లను మంజూరు చేశారు. 15 శాతం రాయితీపై నూలు సబ్సిడీ పథకం అమలు చేస్తున్నారు. 2,640 మంది చేనేత కార్మికులకు ముద్ర పథకం కింద రూ.24.43 కోట్లు అందజేశారు. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా చర్యలు తీసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నారు.
2024 ఏప్రిల్ నుంచి 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.78.73 కోట్ల నగదు పరపతి సౌకర్యం కల్పించాం. నేతన్నల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిలో భాగంగా యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా నేతన్నల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం కింద చేనేతలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర బీసీ, సంక్షేమ, చేనేత శాఖ ఎస్. సవిత. గత వైసీపీ ప్రభుత్వం కంటే అదనంగా రూ.వెయ్యిలు ఇవ్వనున్నారు. చీరాలలో నేతన్నల ఆదాయంతో పాటు చేనేత ఉత్పత్తుల పెంపుదలకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) కింద రూ.4.17 కోట్లు మంజూరయ్యాయి. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్.హెచ్.డి.పి)లో భాగంగా ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. పిఠాపురంలో రూ.12 కోట్లు, మంగళగిరిలో రూ.22.35 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టుల ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలో చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం (ఎస్.సి.డి.పి)లో భాగంగా రూ.10.44 కోట్లతో పది క్లస్టర్లను మంజూరయ్యాయి.

















