చేనేతలందరికీ ఉచిత విద్యుత్ : ఎస్. స‌విత

ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ అమలు

hellotelugu-MinisterSavitha

అమరావతి : చేనేత‌న్న‌ల‌కు తీపి క‌బురు చెప్పింది ఏపీ స‌ర్కార్. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ అందజేయనున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్ర‌కటించారు. చేనేత వృత్తిలో కొనసాగే వారందరికీ ఈ పథకం వర్తింప చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు మురుగుడు హనుమంతరావు అడిగిన ప్రశ్నకు ఎస్.సవిత పైవిధంగా సమాధానం చెప్పారు. పోగును వస్త్రంగా మార్చి మనుష్యుల ఆత్మ గౌరవాన్ని కాపాడే మహానీయులు నేతన్నలని కొనియాడారు. చేనేతలకు అన్న ఎన్టీఆర్ తొలుత అండగా నిలుస్తే, 2014-19లో సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో నేతన్నలకు స్వర్ణ యుగంలా గడిచిందని అన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ అందజేయబోతున్నామ‌ని స్పష్టం చేశారు. చేనేత వృత్తిలో ఉన్న వారందరూ ఉచిత విద్యుత్ కే అర్హులేనన్నారు. మగ్గం నేసే నేతన్నలకు 200 యూనిట్లను ఇస్తామ‌న్నారు ఎస్. స‌విత‌. దీనివల్ల ఆయా నేతన్నల కుటుంబాలకు నెలకు రూ.720లు, ఏడాదికి రూ.8,640లు ఆదా కానుందన్నారు. మర మగ్గం నేసే నేతన్నలకు 500 యూనిట్లు ఉచితంగా సరఫరా చేయనున్నామని, దీనివల్ల ఆయా కుటుంబాలకు రూ.1,800లు, ఏడాదికి రూ.21,600 ఆర్థికంగా మేలు చేకూరనుందన్నారు. 2014-19 మాదిరిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత కూడా త్రిఫ్ట్ ఫండ్ నిధులు అందజేస్తున్నామన్నారు. అవసరమైన మేరకు చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాలు కొనుగోలు చేస్తున్నామని, గతంలో చేనేత సహకార సంఘాలకు పెట్టిన బకాయిలు కూడా చెల్లిస్తున్నామని వెల్లడించారు.

Exit mobile version