బీసీ రిజ‌ర్వేషన్లు అమ‌లు చేయాలి : వీహెచ్

టీపీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్ తో ప్ర‌త్యేక భేటీ

hellotelugu-VHanumanthaRao

హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇప్పటికే ప్ర‌కటించిన విధంగా బీసీల‌కు 42 శాతం చ‌ట్ట బ‌ద్దంగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరారు ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ వి. హ‌నుమంత రావు. ఆయ‌న గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో 42 శాతం బిసి రిజర్వేషన్ల పైన సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లు అమలు కోసం చేసిన కులగణన, బిసి కమిషన్ ఏర్పాటు, డెడికేషన్ కమిషన్ నివేదిక, అసెంబ్లీ, మండలి తీర్మానాలు, కేబినెట్ తీర్మానాలు తదితర అంశాలు ఇందులో చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

కాంగ్రెస్ పార్టీ పరంగా బిసి సంఘాలతో సమావేశాలు, రౌండ్ టేబుల్ మీటింగ్ లు, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మీటింగ్ లు తదితర కార్యక్రమాలు చేసిన అంశాలపై చర్చించారు ఇరువురు నేత‌లు. ప్రస్తుతం బిసి రిజర్వేషన్లు అంశం ముగిసిన అధ్యాయం కాద‌ని, ఎలాగైనా సాధించి తీరాలని, అందుకు తగిన విధంగా వ్యూహాలు రూపొందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ బిసి నాయకులు ఏఐసీసీ అగ్రనేత ను కలిసి జాతీయ స్థాయిలో మరింత ఒత్తిడి పెంచేలా పోరాటం చేయాలని నిర్ణ‌యం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ని రాష్ట్రం నుంచి అఖిల పక్షం ప్రతినిధి బృందం కలిసే విధంగా ప్రయత్నం చేయాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని కోరారు వి. హ‌నుమంత రావు. బిసి రిజర్వేషన్ల విషయంలో ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లు అంశంలో అన్ని రకాల సాంకేతిక, చట్టపరమైన, న్యాయ పరమైన చర్యలు తీసుకున్నామని వివరించాల‌న్నారు.

Exit mobile version