KTR : హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఏ సీఎం 50 సార్లు ఢిల్లీకి వెళ్లలేదని, ఎందుకు వెళ్లారో, రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకు వచ్చారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తన వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసం వెళుతున్నారే తప్పా ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని అన్నారు. స్వంత ఖర్చులతో వెళుతున్నారా లేక రాష్ట్రం తరపున వెళుతున్నారో చెప్పాలన్నారు. ఆయన దేశ రాజధాని పర్యటన వల్ల ఒక్క పైసా కూడా లాభం రాలేదన్నారు. ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారో చెప్పే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అంటూ నిలదీశారు కేటీఆర్.
KTR Slams CM Revanth Reddy
ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా.. ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, నరేంద్రమోడీ, చంద్రబాబుల ముద్దుల బానిసగా తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ తాకట్టు పెట్టాడని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో 50 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డితో రాష్ట్రానికి పైసా ప్రయోజనం కలగలేదన్నారు. ఢిల్లీ బాసుల కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
ఫ్లైట్ టికెట్‌లు బుక్ చేసుకోవడం, ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేయడం, వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో ఊపుకుంటూ రావడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. పాలించే ముఖ్యమంత్రి కావాలి కాని, ఢిల్లీకి విహార యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం అవసరం లేదన్నారు కేటీఆర్. రెండో యజమాని మోడీకి సన్నిహితులైన వ్యాపారవేత్తలకు తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కేసుల నుంచి తప్పించు కుంటున్నారని ఆరోపించారు కేటీఆర్. అన్నదాతల కడుపు కొట్టి తెలంగాణ జల సంపదను తన మూడో యజమాని చంద్రబాబుకు దోచిపెడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : AV Ranganath – Strong Focus : కింగ్స్ వే పాఠశాల నిర్మాణంపై ఫోకస్ – ఏవీ రంగనాథ్
