సూర్యాపేట జిల్లా : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. రాష్ట్రంలో పూర్తిగా పాలన గాడి తప్పిందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. అభివృద్దే మన ఆయుధం అని అన్నారు. కెసిఆర్ నాయకత్వమే బాగుండేదన్న అభిప్రాయం ప్రజల్లో వచ్చిందన్నారు. ఇదే నేడు తెలంగాణలో అన్నీ రంగాల ప్రజల మాట వినిపిస్తోందని చెప్పారు జగదీశ్ రెడ్డి. హామీల అమలులో కాంగ్రేస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను ఆచరణకు నోచుకోని హామీలను గుప్పించి మోసం చేసిందన్నారు .
అధికారం చేపట్టిన కొద్దిరోజుల నుంచే రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని చెప్పారు. రెండేళ్లలో ఆ వ్యతిరేకత తీవ్రంగా పెరిగిందన్నారు. అందుకు నిదర్శనం స్థానిక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ సాధించిన అద్భుత ఫలితాలేనని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సైనికుల కృషి ఎనలేనిదని ప్రశంసలు కురిపించారు జగదీశ్ రెడ్డి. గుర్తులు లేకుండానే అత్యధిక సీట్లు సాధించుకున్నామని ఈ క్రెడిట్ మాత్రం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలకే దక్కుతుందని అన్నారు. ఇక గుర్తులు ఉండే ఎన్నికలు గనుక జరిగితే అధికార కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించడం పక్కా అని జోష్యం చెప్పారు.















