హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయనకు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ నిబంధనలు పాటించకుండా సభ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆరోపించారు. రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదన్నారు. డిప్యూటీ స్పీకర్ నియామకంపై స్పందన లేదన్నారు. సుప్రీంకోర్టు హెచ్చరించినా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ నిలదీశారు హరీశ్ రావు. రాత పూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వక పోవడం నిబంధనల ఉల్లంఘనేనని పేర్కొన్నారు. సభను తరచుగా వాయిదా వేస్తూ రూల్ 13, 16 లను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ఆదివారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
క్వశ్చన్ అవర్, జీరో అవర్ ను కుదిస్తూ సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డిప్యూటీ స్పీకర్ లేక పోవడంతో ప్రివిలేజ్ కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్నారు. ఎస్టిమేట్స్ కమిటీ ఛైర్మన్ రాజీనామా చేసినా ఇప్పటి వరకు కమిటీని పునరుద్ధరించక పోవడం శోచనీయం అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) ను ఉల్లంఘిస్తూ అనర్హత వేటుపై కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు .పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.


















