హైదరాబాద్ : పాలిటెక్నిక్‌లను ఉపాధి , శిక్షణ కమిషనరేట్ పరిధిలోకి తీసుకు రావాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణను సర్దుబాటు చేయడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. సాంకేతిక విద్యా కమిషనరేట్ నుండి పాలిటెక్నిక్‌లను సీఈటీ పరిధిలోకి తీసుకువస్తూ జూన్ 16, 2026న జీవో 97 జారీ చేయడం జరిగిందన్నారు. ఇది కేవలం పరిపాలనా పరమైన పునర్వ్యవస్థీకరణ మాత్రమేనని, పాలిటెక్నిక్‌ల గుర్తింపులో ఎలాంటి మార్పు కాదని ఆయన స్పష్టం చేశారు.
పాలిటెక్నిక్‌లు, ఐటీఐలు/అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) , యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్‌యూ)లను సీఈటీ పరిధిలోకి తీసుకు రావడం ద్వారా సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి ,పరిశ్రమల అవసరాలను అనుసంధానించే ఒక సమీకృత వ్యవస్థ ఏర్పడుతుందని వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న ఏఐసీటీఈ గుర్తింపు పొందిన మూడేళ్ల డిప్లొమా కోర్సులు, ఫీజులు, విద్యా నిర్మాణం యథాతథంగా కొనసాగుతాయని ప్రకటించారు. ఇందులో విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాలల్లో టీజీ ఈసీఈటీ లాటరల్ ఎంట్రీకి అర్హులుగా కొనసాగుతారని పేర్కొన్నారు.
ఎస్‌బీటీఈటీలోని పాలిటెక్నిక్ విభాగం సీఈటీ కింద ఒక ప్రత్యేక యూనిట్‌గా పనిచేస్తుందని అదే క్రమంలో ప్రవేశాలు, పరీక్షలు, డిప్లొమా సంబంధిత విద్యా విషయాలను నిర్వహించడం కొనసాగిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న పోస్టులు లేదా కేడర్ సంఖ్యలో ఎలాంటి కోత ఉండదని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి హోదా, పే స్కేళ్లు, డీఏ, ఇంక్రిమెంట్లు, సీనియారిటీ, ప్రమోషన్లు, జీపీఎఫ్, ప్రాణ్, గ్రాట్యుటీ , పెన్షన్ ప్రయోజనాలు యథాతథంగా కొనసాగుతాయని వివేక్ స్పష్టం చేశారు. నియామకాలు టీజీపీఎస్‌సీ ద్వారా కొనసాగుతాయని చెప్పారు. సాంకేతిక విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం టాటా టెక్నాలజీస్‌తో ₹2,300 కోట్ల విలువైన 10 సంవత్సరాల భాగస్వామ్యాన్ని కుదుర్చుకుందిని తెలిపారు. ఇప్పటికే 65 ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేశారన్నారు.
ప్లేస్‌మెంట్లు, అప్రెంటిస్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు , పాఠ్యప్రణాళిక అభివృద్ధి కోసం సిస్కో, మైక్రోసాఫ్ట్, మహీంద్రా అండ్ మహీంద్రా, జీఎంఆర్, స్విగ్గీ , డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌తో సహా 200కు పైగా పరిశ్రమలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. .ప్రతి పాలిటెక్నిక్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, అంతర్జాతీయ సర్టిఫికేషన్లు, ఇంటర్న్‌షిప్‌లు, వ్యవస్థాపకత , ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలతో ఒక ప్రత్యేక ప్లేస్‌మెంట్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. పాలిటెక్నిక్‌ల భూమి, భవనాలు మరియు ఇతర ఆస్తులు వైఐఎస్‌యూకు బదిలీ చేయబడవని, అవి సీఈటీ ఆధీనంలోనే ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.
