ఢిల్లీ : రోజు రోజుకు నల్సార్ వివాదం రాజుకుంటోంది. ఇప్పటికే నల్సార్ లో చదువు పూర్తి చేసుకున్న లా గ్రాడ్యూయేట్స్ కు బార్ కౌన్సిల్ లో చోటు కల్పించకుండా నిషేధం విధిస్తున్నట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా ప్రకటన విడుదల చేశారు. దీనిపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది. ఆయన తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో గురువారం కాక్రోచ్ జనతా పార్టీ ( సీజేపీ) స్పందించింది. న్యాయవాదుల న్యాయ పరమైన డిమాండ్ కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎన్‌రోల్‌మెంట్ ఉత్తర్వును ఉపసంహరించు కోవడంపై మానన్ కుమార్ మిశ్రాను లక్ష్యంగా చేసుకుని నిరసన కొనసాగుతోంది. తాజాగా బీసీఐ చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా రాజీనామా కోరుతూ న్యూఢిల్లీలో న్యాయవాదులు చేపట్టిన నిరసనకు ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ మద్దతు తెలిపింది.
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నుండి 2026లో పట్టభద్రులయ్యే బ్యాచ్‌ను న్యాయవాదులుగా నమోదు చేయకుండా నిషేధిస్తూ జారీ చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకున్న ఉత్తర్వుపై చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా రాజీనామా కోరుతూ గురువారం న్యూఢిల్లీలో నిరసన మొదలైంది. బీసీఐ ప్రధాన కార్యాలయం వెలుపల న్యాయవాదుల బృందం సమావేశమై మిశ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఆల్ ఇండియా యంగ్ అడ్వకేట్స్ అసోసియేషన్’ ఈ నిరసనకు పిలుపునివ్వగా సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ నిరసనకు మద్దతు ప్రకటించారు. నల్సార్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్‌ను ఆహ్వానించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ , ప్రొఫెసర్లకు లేఖ రాయడంతో ఈ వివాదం మొదలైంది.
