హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్ లో చోటు చేసుకున్న ఒడిదుడుకుల కారణంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ లు ఇవాళ పతనం దిశగా ట్రేడ్ అయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడంతో, భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాలపై భారం పెరిగింది. దీనివల్ల డాలర్‌కు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ మరింత దిగజారింది. విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ల నుంచి నిధులను భారీగా ఉపసంహరించు కోవడం కూడా రూపాయి పతనానికి మరో కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూపాయిని నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
పలు దేశాల్లో యుద్ధాల వల్ల అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరలు పెరుగుతున్నాయని, ఏడాది పాటు కొనుగోళ్లను నిలిపి వేద్దామని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఫలితంగా కల్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్ షేరు 7.43 శాతం తగ్గి రూ. 393.00 వద్ద ట్రేడ్ అవుతుండగా, పీసీ జ్యువెలర్ లిమిటెడ్ షేరు 3.89 శాతం తగ్గి రూ. 9.13 వద్ద కదలాడుతోంది. ఇంకా అనవసరమైన విదేశీ ప్రయాణాలు, విదేశీ విహార యాత్రలు, విదేశీ వివాహాలకు దూరంగా ఉంటూ, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగులు మళ్లీ పెరగాలి. వ్యక్తిగత వాహనాలు తగ్గించి ప్రజా రవాణా వినియోగం పెంచాలి. చమురు వాడకం తగ్గితే, విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది అని సూచించారు. ఈ నేపథ్యంలో మున్ముందు కేంద్రం నుంచి ఏదైనా కీలక ప్రకటన వస్తుందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
