అమరావతి : జలాశయాలు, నదీ ప్రవాహాలు, సాగునీటి లభ్యతను అంచనా వేసి అధిక నీరు అవసరమయ్యే వరికి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, స్వల్పకాలిక పంటలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. ఆగస్టు 7, 2026న ప్రారంభించిన ‘రైతన్న మీ కోసం–El Niño Mitigation Plan’ ద్వారా 46.86 లక్షల మంది రైతులకు సంబంధించిన 2.75 కోట్ల కమతాలను పరిశీలిస్తూ వ్యవసాయ, రెవెన్యూ, జలవనరులు తదితర శాఖల సమన్వయంతో ప్రతి కమతంలోని పంట, నీటి లభ్యత, నేల తేమ, పంట దశ, ప్రమాద స్థాయిని అంచనా వేసి Farmer Parcel-Specific Advisory అందిస్తున్నామని తెలిపారు. అదే విధంగా పంటల బీమాను మరింత విస్తరించి 2025లో 19.5 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులను 2026లో 35.15 లక్షలకు పెంచామని, బ్యాంకు రుణాలు తీసుకోని Non-Loanee Farmersను కూడా బీమా పరిధిలోకి తీసుకు రావడంతో వారి సంఖ్య 2 లక్షల నుంచి 27.5 లక్షలకు పెరిగిందని చెప్పారు అచ్చెన్నాయుడు.
ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, పట్టు తదితర అనుబంధ రంగాల్లోనూ నీటి పొదుపు, తేమ సంరక్షణ, పశుగ్రాసం, నీటి కొరత నివారణ, పంట–పశు రక్షణ చర్యలు చేపడుతున్నామని, గత ఏడాది 15,303గా ఉన్న Animal Sheltersను ఈ ఏడాది 20,000కు పెంచే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. రాయలసీమను ‘రతనాల సీమ’గా తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ అభివృద్ధిపై కనీసం ఒక్క సమీక్ష సమావేశమైనా నిర్వహించారా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వ్యవసాయాన్ని అత్యంత ప్రాధాన్య రంగంగా భావిస్తున్నందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నెలకు రెండుసార్లు వ్యవసాయ రంగంపై సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టామన్నారు. రైతుల సమస్యలు, సాగునీరు, నీటి సంరక్షణ, పంటల పరిస్థితి, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
















