అమరావతి : మిర్చి పంటపై విస్తృతంగా కనిపిస్తున్న నల్ల తామర పురుగు దాడిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్‌గా స్పందించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయం నుండి ఉద్యానవన శాఖ డైరెక్టర్ డా. కే. శ్రీనివాసులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై పూర్తి నివేదికను వెంటనే అందించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని, పురుగు ప్రభావం ఉన్న ప్రాంతాలకు శాస్త్రవేత్తలను వెంటనే క్షేత్రస్థాయికి పంపాలని మంత్రి స్పష్టం చేశారు. మందుల పిచికారీపై శాస్త్రీయ సూచనలు, సాంకేతిక సలహాలను రైతులకు అందించేందుకు ప్రత్యేక బృందాలు పని చేయాలని అన్నారు. 2021 నుంచి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మిరప పంటపై నల్ల తామర పురుగు దాడి జరుగుతుండటంతో, ఈ సమస్యపై గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా శిక్షణలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
ఉద్యాన శాఖ సిబ్బందితో పాటు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు క్షేత్ర సందర్శనలు చేపట్టి రైతులకు ప్రత్యక్ష మార్గదర్శకత్వం అందించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నివారణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రత్యేక కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని హార్టికల్చర్ డైరెక్టర్ మంత్రి అచ్చెన్నాయుడికి వివరించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. ఈ పురుగు నివారణకు డా వై.యస్.ఆర్ విశ్వ విద్యాలయం వారు సూచించిన సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

















