ఎల్ నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన క‌ల్పించాలి : సీఎం

ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనితీరు మారాలి

hellotelugu-APCM

అమరావతి : ఎల్‌నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల పనితీరుపై సీఎం చర్చించారు. ఈ ఏడాది అంతటా ఎల్ నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను రైతులకు వివరించడంతో పాటు.. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను ప్రొత్సహించాలని సూచించారు. దీని నిమిత్తం క్యాంపెయిన్ మోడ్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే ఏ ప్రాంతాల్లో ఏయే పంట సాగు చేయాలనే దానిపై రైతులకు వివరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. పంటల బీమా యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల విషయంలో కొంత గ్యాప్ ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు.

ఆలూరు నియోజకవర్గ పర్యటనలో ఉద్యోగుల పనితీరును చదివి వినిపించినప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందనను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రంపచోడవరంలో విద్యార్థి శివాని ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్ర‌త్యేకంగా హైలెట్ చేశారు. చదువులో టాపర్ అయిన శివాని చనిపోవడం చాలా ఆవేదన కలిగించిందని అన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు సైకో మెట్రిక్ టెస్టులను చేయించాలని విద్యా శాఖ ఆదేశించిందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. మానసిన పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల సేవలు తీసుకోవడంతో పాటు టీచర్లకు కూడా అవసరమైన మేరకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version