ఎలినినో ప్ర‌భావంపై రైతులను అప్ర‌మ‌త్తం చేయాలి

అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి

hellotelugu-APCM

అమ‌రావ‌తి : ఎలినినో ప్ర‌భావం ఇప్పుడు ఏపీని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని పేర్కొన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో కల్పించాల్సిన అవగాహనపై ముఖ్యమంత్రి సమీక్ష చేప‌ట్టారు. జూలై నెలలో 69 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు తెలిపారు సంబంధిత అధికారులు. వచ్చే మూడు నెలల్లో సరాసరి 35 నుంచి 40 శాత మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంద‌న్నారు. జూన్ నవంబర్ మధ్య 844 మి.మీ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 551 మి.మీ మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. అంచనాలకు మించి ఎల్‌నినో ప్రభావం ఉండబోతుందని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో ఎగువ రాష్ట్రాల నుంచి జలాలు వచ్చే అవకాశంపై సీఎం ఆరా తీశారు.

అన్ని జిల్లాల్లోనూ ఎల్‌నినో ప్రభావం చూపిస్తోందని, ఎక్కువగా పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా, కడప జిల్లాల్లో వర్షాభావ పరిస్థితిలు నెలకొంటాయని తెలిపారు. 2.78 లక్షల హెక్టార్లలో పత్తి, 1.07 లక్షల హెక్టార్లలో వరిపై ప్రభావం చూపిస్తుందని వెల్ల‌డించారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలోనే వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంద‌న్నారు. వంశధార నుంచి జలాలు తరలించి పంటలను కాపాడేలా ప్రయత్నించాలని సూచించారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రంలో 122 హై రిస్క్ మండలాలను గుర్తించామ‌న్నారు. హై రిస్క్ మండలాల్లో బోరు ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.

ఆగస్ట్ 3 నుంచి అవగాహన కార్యక్రమాలు, వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి, అత్యవసర విత్తన ప్రణాళికను రూపొందించాల‌న్నారు. ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ఈ నెల 31వ తేదీ వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వరి పంటకు ఆగస్ట్ 15 వరకు సమయం ఉందన్నారు. పశు గ్రాసానికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాల‌న్నారు.

Exit mobile version