తెలంగాణ‌లో లా అండ్ ఆర్డ‌ర్ వైఫ‌ల్యం

నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

hellotelugu-PaddiKaushikReddy

క‌రీంన‌గ‌ర్ జిల్లా : సీఎం రేవంత్ రెడ్డి కొలువు తీరాక రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు స‌న్నగిల్లాయ‌ని మండిప‌డ్డారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోమ్ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు PMJ జ్యూవెలర్స్‌లో జరిగిన దారుణ కాల్పుల ఘటనలో గాయపడిన సిబ్బందిని వేంకటాద్రి హాస్పిటల్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ , హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే సుంకా రవిశంకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్ నగర నడిబొడ్డునే గన్ కల్చర్ పెరగడం, నేరస్తులు రెచ్చి పోవడం ప్రభుత్వ పాలన పూర్తిగా చేతులెత్తేసిందనే స్పష్టమైన నిదర్శనమని మండిపడ్డారు. కరీంనగర్‌లో గతంలో BRS ప్రభుత్వం 700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను బలోపేతం చేసిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోక పోవడం వల్ల పరిస్థితి అదుపు తప్పిందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం సమయంలో ఇంటర్‌సెప్టర్ విధానం ద్వారా ప్రతి చౌరస్తాలో హోమ్ గార్డ్, కానిస్టేబుల్, ASIలను నియమించి శాంతి భద్రతలు కాపాడేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం సీపీకి ప్రజా భద్రతపై పట్టింపు లేకుండా కేవలం జల్సాలు మాత్రమే మిగిలాయని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని, రాష్ట్రంలో చట్టవ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ఆరోపించారు. .గాయపడిన బాధితులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి కోటి రూపాయల ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలని స్పష్టం చేశారు .నగర పోలీస్ కమిషనర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని, కాల్పులకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు.

Exit mobile version