సియోల్ (సౌత్ కొరియా) : ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీలో పేరెన్నికగన్న షిన్‌హ్యుప్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ టేహూ కిమ్ , ఇంజనీరింగ్ అడ్హెసివ్ షిబ్లీ అహమ్మద్ లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… షిన్‌హ్యుప్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీకి ఏపీని గమ్యస్థానంగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నాయుడుపేట వద్ద అభివృద్ధి చేసిన PCB ఎకోసిస్టమ్ వద్ద సిర్మా, జెట్‌వర్క్, ఎపిటోమ్, సిప్సా టెక్ అనే నాలుగు కంపెనీలు తయారీ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎండ్-టు-ఎండ్ PCB క్లస్టర్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు మంత్రి నారా లోకేష్. షిన్‌హ్యుప్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ టేహూ కిమ్ మాట్లాడుతూ భారతదేశంలో ఈవీ/ఆటో, హెల్త్‌కేర్, స్మార్ట్ మీటరింగ్ కోసం PCBలు, CCL, EMS లు తయారుచేసే అతిపెద్ద ప్లాంట్ ను తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. రూ.1,595 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న ఈ ప్లాంట్ ద్వారా 2,170మందికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టేహూ కిమ్ తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర సర్కార్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మంత్రి నారా లోకేష్.

















