హైదరాబాద్ : యూపీఐ లావాదేవీల ఛార్జీల నుండి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరారు మొబైల్ ఫోన్ విక్రేతలు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్’ పేర్కొంది. దేశ వ్యాప్తంగా 1.50 లక్షల మందికి పైగా చిన్న మొబైల్ ఫోన్ , ఎలక్ట్రానిక్స్ విక్రేతలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపింది. ‘మొబైల్ రిటైల్ రంగం ఇప్పటికే తక్కువ వ్యాపార లాభాలతో నడుస్తోందని, కాబట్టి యూపీఐ చెల్లింపులపై ప్రతిపాదిత ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ లేదా లావాదేవీల ఛార్జీల నుండి చిన్న , మధ్య తరహా మొబైల్ విక్రేతలకు మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. మొబైల్ రిటైల్ రంగం అమ్మకాల మందగమనం , అధిక నిర్వహణ ఖర్చులను ఎదుర్కొంటున్న తరుణంలో యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించడం వల్ల విక్రేతలపై ఖర్చులు నేరుగా పెరుగుతాయని అసోసియేషన్ వాపోయింది.
“ప్రధాన మొబైల్ విక్రేతలు చాలా తక్కువ నికర లాభాలతో (సాధారణంగా 0.75 శాతం నుండి 1.5 శాతం మధ్య) వ్యాపారం చేస్తున్నారని స్పష్టం చేసింది.. డిజిటల్ చెల్లింపులలో గణనీయమైన వాటా కలిగిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీ విధిస్తే, అది వారి వ్యాపార మనుగడకు అవసరమైన లాభాలను దెబ్బతీస్తుంది అని ఆ వాణిజ్య సంఘం పేర్కొంది. అసోసియేషన్ అంచనా ప్రకారం నెలకు రూ. 10 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు జరిపే విక్రేతపై 0.4 శాతం ఛార్జీ విధిస్తే, వారికి నెలకు అదనంగా రూ. 4,000 నుండి రూ. 16,000 వరకు భారం పడుతుందని వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ ధరల పెరుగుదలను కూడా అసోసియేషన్ ప్రస్తావించింది; నవంబర్ 2025 నుండి విడిభాగాలు , మెమరీ ఖర్చులు పెరగడం వల్ల హ్యాండ్‌సెట్ ధరలు భారీగా పెరిగాయని తెలిపింది. దీంతో అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గాయని వాపోయింది.
2025లో సుమారు రూ. 10,000కు లభించిన ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల ధర ఇప్పుడు సుమారు రూ. 17,000కు పెరిగిందని, డిసెంబర్ 2026 నాటికి అవి రూ. 20,000 వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. విక్రేతలు ఇప్పటికే వ్యాపార పరిమాణంలో గణనీయమైన తగ్గుదలని ఎదుర్కొంటున్నారని ఏఎంఆర్ఏ తెలిపింది, అలాగే చెల్లింపులకు సంబంధించిన అదనపు ఖర్చులు చిన్న దుకాణాలపై మరింత ఒత్తిడిని పెంచుతాయని పేర్కొంది.
