అమరావతి : ప్రభుత్వ పరంగా ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిబద్ధతతో పని చేస్తోందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రానికి పనికి వస్తోందన్నారు. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నాలుగు గోడల మధ్య మంత్రులు, ఉన్నతాధికారులు తీసుకునే ప్రజోపయోగ నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అర్ధవంతంగా అందాలంటే అంతా సమష్టిగా పని చేయాలని సూచించారు.
ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడటం లేదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసే ప్రతి రూపాయి విలువైనదేనని అన్నారు. పెట్టే ఖర్చు, దానివల్ల అందే ప్రయోజనం ప్రజలకు ఉపయోగపడేలా క్షేత్రస్థాయి సిబ్బంది పని చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన మీద దృష్టి పెట్టామన్నారు.


















