గజపతినగరం : ఒకటో తేదీన పింఛన్ల పంపిణీతో గ్రామాలన్నీ కళకళ లాడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పండుగను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా గజపతి నియోజకవర్గం దత్తి గ్రామంలో సీఎం పర్యటించారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్లు అందించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొంతూరు అప్పలరాజుకు, ఆయన తల్లికి పింఛను అందజేశారు. అనంతరం ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఒకప్పుడు పండుగ చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేదని ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ప్రతి నెలా పండుగ వస్తోందని సీఎం అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత నేటితో కలిపి 16 నెలల్లో రూ.48,019 కోట్లు పింఛన్లపై ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం మనదేనని అన్నారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 50,765 మందికి రూ.2,745 కోట్లు పింఛన్లు కింద పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వృద్ధాప్య పింఛనుదారు చనిపోతే అతని భార్యకు వెంటనే వితంతు పింఛన్ మంజూరు చేస్తున్నాం. ఈ నెలలో కొత్తగా 10,578 మందికి రూ.4.23 కోట్లు వితంతు పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. 2 నెలలు పెన్షన్ తీసుకోని 1,34,023 మందికి రూ.108 కోట్లు, 3 నెలలుగా పింఛన్లు తీసుకోని 11,545 మందికి రూ.14 కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి తెలిపారు . గత ప్రభుత్వంలో ఒకటి రెండు నెలలు పింఛను తీసుకోకపోతే కట్ చేసేవాళ్లని, ప్రజా ప్రభుత్వంలో పేదలకు న్యాయం చేయాలనే ఏకైక ధ్యేయంతో రెండు నెలలు పింఛను తీసుకోక పోయినా మూడో నెల ఇస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
