చెన్నై : చెన్నై నగర పాలక సంస్థ సంచలన ప్రకటన చేసింది. నగరం అంతటా ముఖ్యమంత్రి గ్రంథాలయాల పని తీరును మెరుగు పరచనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో 16 ముదల్వర్ పడైప్పగం (సీఎం గ్రంథాలయాలు) పని చేస్తుండగా మరో ఎనిమిది గ్రంథాలయాల నిర్మాణం కొనసాగుతోంది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నగర వ్యాప్తంగా ఉన్న ఈ గ్రంథాలయాల పని తీరును మెరుగుపరిచే చర్యలపై చర్చించడానికి ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. రిప్పన్ భవనంలో జరిగిన ఈ సమావేశానికి జీసీసీ కమిషనర్ డాక్టర్ జి.ఎస్. సమీరన్ అధ్యక్షత వహించారు. రీజినల్ డిప్యూటీ కమిషనర్లు హెచ్.ఆర్. కౌశిక్ (సెంట్రల్), శ్వేత సుమన్ (నార్త్) సహా పలువురు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జోనల్ అధికారులు, తమిళనాడు ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, జిల్లా గ్రంథాలయ అధికారులు , కార్పొరేషన్ అధికారులు కూడా హాజరయ్యారు.
ప్రస్తుతం చెన్నైలో 16 గ్రంథాలయాలు పని చేస్తున్నాయి. మరో ఎనిమిదింటి నిర్మాణం జరుగుతోందని కార్పొరేషన్ తెలిపింది. అధికారులు ఈ గ్రంథాలయాల వినియోగాన్ని సమీక్షించి, పాఠకులకు అందించే సేవలను మరింత మెరుగు పరిచే మార్గాలపై చర్చించారు. ప్రజా గ్రంథాలయాల శాఖతో సమన్వయాన్ని బలోపేతం చేయడం, గ్రంథాలయాల నిర్వహణ కోసం భద్రతా సిబ్బంది, హౌస్‌కీపింగ్ సిబ్బంది , రిసెప్షనిస్టులతో సహా తగినంత మంది సిబ్బందిని నియమించడం , వాటి నిరంతర నిర్వహణను పర్యవేక్షించడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. వై-ఫై సదుపాయం కల్పించడం ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలను కూడా కమిషనర్ సమీక్షించారు, అలాగే ఐటీకాట్ సాంకేతిక సహకారంతో మౌలిక సదుపాయాల మెరుగుదల అవకాశాలను పరిశీలించారు. గ్రంథాలయాల పనితీరును సమగ్రంగా మెరుగు పరిచేందుకు సమావేశంలో చర్చించిన సిఫార్సుల ఆధారంగా అవసరమైన చర్యలను అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
