అమరావతి : ఆంధ్రప్రదేశ్- ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో భారత్-ఆస్ట్రేలియా సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ ఏపీ ప్రభుత్వం.. ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో నాలుగు వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అంతర్జాతీయ అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలపై ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
మంత్రి నారా లోకేష్ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అక్కడి విశ్వ విద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులతో జరిపారు. ఏపీకి రావాలని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఆహ్వానం పలికారు. ఏపీలో అవకాశాలు, ఇస్తున్న రాయితీలను వివిధ సంస్థల ప్రతినిధులకు వివరించారు. దీనిపై అప్పుడే సానుకూలంగా స్పందించారు ఆస్ట్రేలియా ప్రతినిధులు. మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా టూర్ వల్లే కీలకమైన ఎంవోయూలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశాఖ లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ , ఐఐటీ తిరుపతి, ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ కలిసి ఐఐటీ తిరుపతిలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను సోలార్ తయారీ పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యీకరణకు జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
