దావోస్ :- ప్రపంచ పారిశ్రామిక రంగంలో వస్తోన్న మార్పులు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసు కునేందుకు దావోస్ వేదిక ఎంతో ఉపయోగకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీని గ్లోబల్ బ్రాండ్‌గా నిలిపేందుకు, కొత్త పాలసీలపై మార్కెట్ స్పందన అంచనా వేయడానికి ఈ పర్యటన ఎంతో దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. 2025 దావోస్ పర్యటనలో నిర్వహించిన చర్చల ఫలితంగా ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో గ్రౌండ్ అయ్యాయని సీఎం వెల్లడించారు. దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మర్యాద పూర్వక భేటీ అయ్యారు. ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగి చంద్రశేఖరన్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ…మూడు రోజుల పాటు నిర్వహించిన వేర్వేరు సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఏఐ, అగ్రికల్చర్, టూరిజం వంటి కీలక రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న విజయాలను వివరించారు.
గతంతో పోలిస్తే భారత్ పట్ల ప్రపంచ దిగ్గజ కంపెనీలు మరింత ఆసక్తి చూపుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. యువశక్తి, సమర్థ నాయకత్వం, అనుకూల విధానాల కారణంగా నేడు ప్రతి రంగంలో భారత్‌లో కంపెనీల స్థాపనకు విస్తృత అవకాశాలు పెరిగాయని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆలోచనలు, తన అనుభవాలను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ముఖ్యమంత్రితో పంచుకున్నారు. విశాఖలో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్, అమరావతిలో క్వాంటం వాలీ, కర్నూలులో ప్రతిపాదించిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేకంగా టాటా ట్రస్ట్ నుంచి అధికారులను పంపి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రశేఖరన్ తెలిపారు. రాష్ట్రంలో టాటా గ్రూప్ చేపడుతున్న టూరిజం ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఈ రంగంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని టాటా గ్రూపును సీఎం కోరారు.
