అమరావతి : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు సోలార్ సిస్టంపై. తమ ప్రభుత్వం విద్యుత్ ఆదా మార్గాలను అన్వేషిస్తోందని చెప్పారు. వేసవి కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ఈరోజు దర్శి నియోజకవర్గం పర్యటనలో భాగంగా దొనకొండ మండలం మల్లంపేట కాలనీలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా సంతోషంగా ఉందన్నారు. ఇదే సమయంలో నివాసాలపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్లను పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా కోటి సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చోరవతో రాష్ట్రానికి 20 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు దక్కాయని చెప్పారు గొట్టిపాటి రవికుమార్. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నాం అన్నారు. 3 కిలో వాట్లతో మొత్తం 300 యూనిట్లు ఉత్పత్తి అవుతుందని చెప్పారు. వినియోగదారుల అవసరాలకు పోగా మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని వెల్లడించారు. మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు పోటీగా మన ఆంధ‌్రప్రదేశ్ రాష్ట్రం సూర్య ఘర్ అమలులో దూసుకు పోతుందని పేర్కొన్నారు మంత్రి. ఈ కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మీ , కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి , కూటమి నాయకులు పాల్గొన్నారు.















