Anil Ambani : బ్యాంకు లోన్ మోసాలకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి నోటీసు జారీ చేసింది. ఆయనను విచారణ కోసం ఈడీ ఆగస్టు 5న హాజరు కావాలని ఆదేశించింది.
Anil Ambani – ED Case
ఇటీవల అనిల్ అంబానీకి (Anil Ambani) చెందిన కంపెనీలపై ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో ఈడీ మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించింది. ఈ దాడుల సమయంలో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని, దాదాపు 25 మందిని అధికారులు విచారించారు. ఈడీ ఈ దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా చేపట్టింది.
రూ. 3,000 కోట్ల లోన్ దారి మళ్లింపు పై దృష్టి
2017-18 సంవత్సరాల్లో యస్ బ్యాంకు ద్వారా అనిల్ అంబానీకి (Anil Ambani ) చెందిన గ్రూపు సంస్థలకు రూ.3 వేల కోట్లకు పైగా రుణాలు మంజూరైన సంగతి తెలిసిందే. ఈ లోన్ల జారీలో ఫైనాన్షియల్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. బ్యాంకు అధికారులకు లంచాలు ఇచ్చారా? కంపెనీలు నిజంగా అర్హతలు కలిగి ఉండేవేనా? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది.
కీలక కంపెనీలపై ఆరోపణలు
రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అనిల్ అంబానీ గ్రూపు సంస్థలు ఈ దాడులపై స్పందిస్తూ, తమ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టం చేశాయి. షేర్‌హోల్డర్లు, ఉద్యోగులు, ఆర్థిక స్థితిపై ఇది ప్రభావం చూపదని పేర్కొన్నాయి.
మరోవైపు, రిలయన్స్ హోం ఫైనాన్స్‌లో జరిగిన అన్యాయాలపై సెబీ (SEBI) నివేదికను ఈడీకి అందించింది. 2017–2019 మధ్యకాలంలో కంపెనీ లోన్ పోర్ట్‌ఫోలియో రెట్టింపైందని, తగిన ఆర్థిక నియమాలు పాటించలేదని పేర్కొంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ వంటి ఇతర కీలక సంస్థలు కూడా ఈ కేసులో తమ డేటాను ఈడీతో పంచుకున్నాయి.
ఎస్బీఐ చర్యలు
రిషయల్ కమ్యూనికేషన్స్ (RCom) కు సంబంధించిన ఖాతాలను ఎస్బీఐ 2020లో మోసపూరిత ఖాతాలుగా గుర్తించింది. అయితే ఢిల్లీ హైకోర్టు అప్పట్లో దీనిపై స్టే ఇచ్చింది. దాంతో ఎస్బీఐ తదుపరి చర్యలకు వెనక్కు తగ్గింది.
Also Read : Today Gold Price : తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు


















