కేరళ : ఈడీ రంగంలోకి దిగింది. కేరళలో ఎంట్రీ ఇచ్చింది. బుధవారం ఉన్నట్టుండి కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంపై దాడులు చేపట్టింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ విజయన్ కూతురు వీణా విజయన్ కంపెనీకి రూ. 1.72 కోట్లు అక్రమంగా చెల్లించిందని ఆరోపణలు ఉన్నాయి కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసిన ఒక రోజు తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, మాజీ ప్రజా పనుల శాఖ మంత్రి పి. ఎ. మహమ్మద్ రియాస్‌ల నివాసాలతో సహా 10 ప్రదేశాలపై దాడులు నిర్వహించింది. సీఎంఆర్ఎల్ నుండి చెల్లింపులు అందుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయన్ కుమార్తె వీణా విజయన్‌ను మహమ్మద్ రియాస్ వివాహం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా ఈడీ ప్రారంభించిన విచారణను రద్దు చేయాలని కోరుతూ సీఎంఆర్ఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. తీర్పు వెలువరించిన కొన్ని గంటలకే ఈ దాడులు ప్రారంభమయ్యాయి. వీణా , ఆమె సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించినట్లు ఆరోపించబడిన చెల్లింపులకు సంబంధించిన లంచం , మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తును సవాలు చేస్తూ సీఎంఆర్ఎల్ కోర్టును ఆశ్రయించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆధారంగా ఈడీ విచారణను రద్దు చేయాలని, అధికారులకు జారీ చేసిన సమన్లపై స్టే విధించాలని ఈ పిటిషన్‌లో కోరారు. సీఎంఆర్ఎల్, వీణాకు, ఆమె కంపెనీకి, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు చెల్లించిందని, చట్ట విరుద్ధమైన ఆర్థిక లావాదేవీలలో పాల్గొందని ఆరోపణలు ఉన్నాయి.

















