న్యూఢిల్లీ : పరమత సహనంతో మెలిగే సనాతన ధర్మాన్ని హేళన చేయడం కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలకు పరిపాటిగా మారడం దురదృష్టకరం అన్నారు జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేష్. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పవిత్రమైన పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష ఎంపీలు సాధువుల వేషధారణతో చేసిన హేళన అత్యంత ఆక్షేపణీయం అని అన్నారు. సనాతన ధర్మం, పూజ్య సాధు-సంతులు, హిందూ సమాజం మనోభావాలను కించ పరచేలా వీధి నాటకాలు ప్రదర్శించి యావత్ హిందూ సమాజాన్ని అవమానించారని వాపోయారు. స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్, కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఇతర ఎంపీలు సాధువుల వేషధారణలో చేపట్టిన నిరసన జుగుప్సాకరంగా ఉందన్నారు. వీరి వేషధారణలు, హావభావాలు హిందూ మతాన్ని అవమానపరుస్తూ అహంకార పూరితంగా ఉన్నాయంటూ మండిపడ్డారు లింగమనేని రమేష్.
రామాయణంలో రావణుడు సీతాపహరణం కోసం మోసపూరితంగా సాధువు వేషంలో వచ్చినట్టుగా – ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ప్రజలను మోసం చేసే వేషధారణ ప్రదర్శించారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వారి మిత్రపక్షాలకు హిందూ వ్యతిరేక వైఖరి కొత్తేమి కాదు, వారు అయోధ్య శ్రీరామ జన్మభూమి ఉద్యమం నాటి నుంచి సనాతన ధర్మంపై నిరంతరం విషాన్ని కక్కుతూనే ఉన్నారని అన్నారు. సనాతన ధర్మాన్ని అవమానపరిస్తే సహించేది లేదని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇప్పటికే పలు వేదికలపై స్పష్టం చేశారని గుర్తు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణకు జనసైనికులు కట్టుబడి ఉన్నారని అన్నారు లింగమనేని రమేష్. పార్లమెంట్ ప్రాంగణంలో సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు చేసిన నిరసన ప్రదర్శనలను జనసేన ఖండిస్తుందన్నారు.
