హైదరాబాద్ : తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి డిజిపి సివి ఆనంద్ కు సూచించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయం సమీపంలో భారీగా వాహనాలు నిలిచి పోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, ముఖ్యమంత్రి వాహనాలు వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఆపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిజిపికి ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డీజీపీ సి.వి. ఆనంద్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ సమస్యపై ముఖ్యమంత్రి పదేపదే మాట్లాడాల్సి రావడం సమస్య తీవ్రతను తెలియ జేస్తోందని, క్షేత్రస్థాయి అధికారులు దీనిని గంభీరంగా పరిగణించాలని డిజిపి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణను పటిష్టం చేసేందుకు అడిషనల్ డిజిపి ఆధ్వర్యంలో త్వరలోనే ‘ట్రాఫిక్ బ్యూరో’ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం విధి విధానాలను రూపొందిస్తున్నామని డిజిపి సివి ఆనంద్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపి వేయకుండా, సింగిల్ లైన్‌గా విభజించి వాహనాలను పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.
















