చెన్నై : మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. తంజావూరులో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. రైతుల ఆందోళనలను ప్రభుత్వం విస్మరిస్తూనే ఉంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుందని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ హెచ్చరించారు. వ్యవసాయ రుణాల మాఫీ, మేకెదాటు ఆనకట్ట ప్రాజెక్టు, మెట్టూరు ఆనకట్టను తెరవడంలో జాప్యం వంటి అంశాలలో అధికార టీవీకే ప్రభుత్వం రైతులను విస్మరించిందని ఆరోపించారు. గురువారం ఆగస్టు 3న తంజావూరులో భారీ నిరసన కార్యక్రమాన్ని ప్రకటించారు. కావేరీ నీటిలో తమిళనాడుకు దక్కాల్సిన వాటాను కాపాడాలని, డెల్టా రైతులకు ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ నాయకత్వంలో ఈ నిరసన జరుగుతుందని వెల్లడించారు మాజీ సీఎం. వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో మోసం , నిరాశ; మేకెదాటు ఆనకట్ట సమస్య పట్ల నిర్లక్ష్య వైఖరి తగదన్నారు. మెట్టూరు ఆనకట్టను తెరవడంలో జాప్యం వల్ల కురువై సాగు దెబ్బతినడం , అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడం వంటి అంశాలను స్టాలిన్ ప్రస్తావించారు. చేతకాని టీవీకే ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేసి, వారిని కష్టాల్లోకి నెట్టి వేసిందని సంచలన ఆరోపణలు చేశారు ఎంకే స్టాలిన్. కావేరీ నీటిలో తమిళనాడుకు దక్కాల్సిన వాటాను కాపాడాలని గట్టి చర్యలు కోరుతూ , డెల్టా రైతులకు ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ నాయకత్వంలో ఆగస్టు 3న తంజావూరులో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు.
