బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు పైకి తమ మధ్య ఎలాంటి ఆధిపత్య పోరు లేదని ప్రకటించినా లోలోపట మాత్రం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి పదవిపై. నేను ఒక ప్రైవేట్ వివాహ కార్యక్రమానికి ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు. డిసెంబర్ 14న తాము ఢిల్లీ కేంద్రంలోని రాంలీలా మైదానంలో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. కర్ణాటక నుండి ఢిల్లీకి కనీసం 300 మంది హాజరవుతారు. రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు దీనిని పర్యవేక్షించాలని, పార్టీ కార్యకర్తలందరినీ ఓటు చోరీకి వ్యతిరేకంగా జరిగే ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని ఆదేశించానని చెప్పారు ఉప ముఖ్యమంత్రి.
ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు ఉన్నాయి. కేబినెట్ సమావేశంలో పాల్గొనాల్సి ఉందన్నారు . అయితే కేసీ వేణుగోపాల్ ముందు తన మద్దతుదారులు తనను సీఎం చేయాలని నినాదాలు చేయడాన్ని ఆయన సమర్థించారు. ఇందులో తప్పేముందంటూ ప్రశ్నించారు. కొందరు మోదీ మోదీ అని అంటారు. ఇంకొందరు రాహుల్ రాహుల్ అని పలవరిస్తారు. నన్ను అభిమానించే వారు కూడా నినాదాలు చేశారని ఇందులో ఎలాంటి తప్పు పట్టేందుకు ఆస్కారమే లేదని స్పష్టం చేశారు డీకే శివకుమార్. సీఎం పోస్టును ఎవరైనా ఆశించవచ్చని , అర్హత ఉంటే ఎవరైనా పోటీ పడేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
