భూములు కోల్పోయిన రైతుల‌కు ఇళ్ల స్థ‌లాలు పంపిణీ

ల‌గ‌చ‌ర్ల‌, హ‌కీం పేట్, పోలేప‌ల్లి గ్రామాల బాధితులు

hellotelugu-KodangalaFarmers

వికారాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొడంగల్‌లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) పారిశ్రామిక కారిడార్ భూసేకరణ వల్ల భూములు కోల్పోయిన రైతులకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ చేశారు. ఈ ప్రాజెక్టు వ‌ల్ల చాలా మంది రైతులు భూములు కోల్పోయారు. వారిలో నియోజ‌క‌వ‌ర్గంలోని ల‌గ‌చ‌ర్ల‌, హకీంపేట్, పోలేపల్లి గ్రామాలకు చెందిన అర్హులైన రైతులకు జిల్లా యంత్రాంగం ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేసింది. కొడంగల్ నియోజకవర్గంలోని బాసిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఈ పట్టాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతుల సంక్షేమం, పునరావాసం, పునఃస్థాపనతో పాటు పారిశ్రామిక వృద్ధిని కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా, నిర్ణీత సమయంలోగా ఇంటి స్థలాల పట్టాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు . ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ లబ్ధిదారులను కోరారు. అలాగే, భూములు కోల్పోయిన వారి కోసం ప్రకటించిన పునరావాస , పునఃస్థాపన చర్యలు సమర్థవంతంగా అమలు చేయబడుతున్నాయని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, ఇంటి స్థలాల కేటాయింపు కోసం ‘డ్రా ఆఫ్ లాట్స్’ (లాటరీ) విధానాన్ని నిర్వహించారు. లాటరీ విధానం ద్వారా మొత్తం 432 మంది లబ్ధిదారులు ఇంటి స్థలాలను పొందగా, మరో 121 మందికి నేరుగా స్థలాలు కేటాయించారు. తద్వారా మొత్తం 553 కుటుంబాలు లబ్ధి పొందాయి. పూర్తి పారదర్శకతను పాటించేందుకు మొత్తం 77 రౌండ్ల డ్రా ప్రక్రియను నిర్వహించారు. పునరావాస కార్యక్రమం విజయవంతమైన అమలులో లగాచర్ల, హకీంపేట్, పోలేపల్లి , రోటిబండ తండా రైతులు అందించిన సహకారాన్ని కలెక్టర్ అభినందించారు. స్థానిక ప్రజల సహకారంతో 230 ఎకరాల విస్తీర్ణంలో ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎడ్యుకేషన్ హబ్’ను ఏర్పాటు చేశామని, త్వరలోనే ఈ ప్రాంతంలో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయడం ద్వారా గణనీయమైన ఉపాధి , ఆర్థిక అవకాశాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు.

ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇప్పటికే 501 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. ప్రజల సహకారం ఇలాగే కొనసాగాలని కోరారు. హైదరాబాద్ , కొడంగల్‌లను అనుసంధానిస్తూ ప్రతిపాదించిన ‘రేడియల్ రోడ్డు’ ఈ ప్రాంత భవిష్యత్తు అభివృద్ధికి కీలకమైన చోదక శక్తిగా నిలుస్తుందని ఆయన అన్నారు.

Exit mobile version