హైదరాబాద్‌లో నీటి సరఫరాకు అంతరాయం

మ‌ర‌మ్మ‌త్తుల దృష్ట్యా 36 గంట‌ల‌కు నీళ్లు బంద్

hellotelugu-WaterEffect

హైద‌రాబాద్ : నీటి కొర‌త హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గండిపేట నీటి పైప్‌లైన్‌కు చేపట్టనున్న మరమ్మతు పనుల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సుమారు 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు పాక్షిక అంతరాయం కలగనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం ఈ అంతరాయం మంగ‌ళ‌వారం, బుధ‌వారం సాయంత్రం 6 గంట‌ల దాకా కొన‌సాగుతుంద‌ని బాంబు పేల్చింది. ప్ర‌స్తుతం ఎల్ నినో ప్ర‌భావం కార‌ణంగా పెద్ద ఎత్తున నీటి క‌ష్టాల‌ను ఎదుర్కొనేలా చేస్తోంది. ఇప్ప‌టికే స‌ర్కార్ తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. నీళ్ల‌ను పొదుపుగా వాడుకోవాల‌ని సూచించారు.

వాటర్ బోర్డు వెల్లడించిన దాని ప్రకారం టోలీచౌకి , మణికొండ ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే 20 ఎంజీడీ సామర్థ్యం గల గాండిపేట కండ్యూట్ (పైప్‌లైన్) వద్ద మరమ్మతు పనులు చేపట్టనున్నారు. పైప్‌లైన్‌లో ఉన్న లీకేజీలను సరిచేసి, నీటి సరఫరా సజావుగా సాగేలా చూసేందుకు ఈ పనులు చేపడుతున్నారు. గండిపేట కండ్యూట్ ద్వారా నీటిని పొందుతున్న హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తగ్గవచ్చు లేదా పూర్తిగా నిలిచి పోవచ్చు. ఈ రిపేర్ల ఎఫెక్ట్ న‌గ‌రంలోని ప్ర‌ధాన ప్రాంతాల‌ను ప్ర‌భావితం చేయ‌నుంది. ఇందులో రెడ్ హిల్స్, నాంప‌ల్లి, మ‌ల్లేప‌ల్లి, సీతారాంబాగ్, కార్వాన్, గోషా మహ‌ల్, చింత‌ల్ బ‌స్తీ, విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీ, ఆసిఫ్ న‌గ‌ర్, అహ్మ‌ద్ న‌గ‌ర్, దోమ‌ల్ గూడ‌, గాంధీ న‌గ‌ర్ .,బంజారా హిల్స్‌లోని కొన్ని ప్రాంతాలు ప్ర‌భావితం కానున్నాయి. గండిపేట కండ్యూట్ ద్వారా నీటిని పొందే ప్రాంతాలకు మాత్రమే ఈ అంతరాయం పరిమితమని వాటర్ బోర్డు స్పష్టం చేసింది.

కృష్ణా, గోదావరి, సింగూరు-మంజీరా నీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని పొందే ప్రాంతాల్లో ఎటువంటి అంతరాయం ఉండద‌ని పేర్కొంది. ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఈ తాత్కాలిక అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ముందుగానే తగినంత తాగునీటిని నిల్వ చేసుకోవాలని సూచించింది.

Exit mobile version