హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది. తన ఫామ్ హౌస్ వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన కంచెను తొలగించింది. ఇదే క్రమంలో ఫాక్స్ సాగర్ అభివృద్ధిపై హైడ్రా దృష్టి సారించింది. సరస్సు కు సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చిన ఆక్రమణలను తొలగిస్తూ, సరస్సు పునరుద్ధరణకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఫాక్స్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. ఎఫ్టీఎల్ పరిధిలో దాదాపు అర కిలోమీటరు మేర కట్ట నిర్మించడాన్ని హైడ్రా తీవ్రంగా పరిగణించింది. ఫామ్ హౌస్ నిర్మాణాల కోసం ఈ కట్టపైనే ఏర్పాటు చేసిన కంచెను కూల్చివేసింది. కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను కూడా తొలగించింది. మరోవైపు, ఫాక్స్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఫామ్ హౌస్ కంచెను కూడా హైడ్రా తొలగించింది. ఎఫ్టీఎల్ . బఫర్ జోన్ పరిధిలో మట్టిని నింపి, కంచె వేసి, గేటు ఏర్పాటు చేయగా… హైడ్రా వాటిని తొలగించింది.
దులాపల్లి గ్రామంలో, మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్ ఒకటి సరస్సు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. ఫాక్స్ సాగర్ ఎఫ్టీఎల్ సరిహద్దు సర్వే నంబర్ 124లో ఉన్నప్పటికీ, నిబంధనలను పట్టించు కోకుండా కంచె వేసి, గేటు ఏర్పాటు చేయడాన్ని హైడ్రా తీవ్రంగా పరిగణించింది. ఇది ఎఫ్టీఎల్ సరిహద్దుల లోపలే ఉండటంతో ఆ కంచెను తొలగించినట్లు హైడ్రా స్పష్టం చేసింది. ఈ విధంగా మల్లారెడ్డి కుటుంబం సుమారు 15 ఎకరాల మేర ఫాక్స్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించి కంచెలు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అలాగే జెడిమెట్ల సర్వే నంబర్లు 41 , 42లలో ఫాక్స్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోకి సుమారు 20 ఎకరాల మేర ఆక్రమించి ఏర్పాటు చేసిన కంచెను కూడా హైడ్రా తొలగించింది. ఈ సందర్భంగా తన తండ్రి దీపక్ వర్మ, తాత ప్రశాంత్ వర్మల వారసుడినని చెప్పుకున్న సుప్రీంకోర్టు న్యాయవాది సౌరభ్ రాజ్ వర్మ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్ సరిహద్దులను చూపించి, ఆ కంచెను తొలగించారు.
