అమరావతి : పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి సహా 70 మందిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా జగన్ రెడ్డి పులివెందుల మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దీనిపై చర్యలు తీసుకోవాలని , మొత్తం 80 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి ఎన్నికలు (రీపోలింగ్) నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ తన పార్టీకి చెందిన 70 మందికి పైగా పోలింగ్ ఏజెంట్లతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి, తమ ఆందోళనలను వివరిస్తూ రాతపూర్వక ఫిర్యాదును సమర్పించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి రాకుండా అడ్డుకున్నప్పుడు, ఎన్నికలు ఎలా సక్రమంగా జరుగుతాయని ఆయన ప్రశ్నించారు. జగన్ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 80 పోలింగ్ కేంద్రాల్లో కేవలం 10 కేంద్రాల్లో మాత్రమే వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను అనుమతించారు. మిగిలిన 70 కేంద్రాల్లో తమ ఏజెంట్లు విధుల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదులపై ఎన్నికల అధికారులు విచారణ జరపాలని కోరారు. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి, మొత్తం 80 కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించాలని జగన్ రెడ్డి డిమాండ్ చేశారు. జరిగిన ఘటనలపై పోలీసుల, ఎన్నికల అధికారుల స్పందనను కూడా ఆయన ప్రశ్నించారు
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించు కోకూడదని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటు వేయడం అంటే, ఈ ఎన్నికల ప్రక్రియ సక్రమంగానే జరుగుతోందని అంగీకరించినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా రీపోలింగ్ నిర్వహిస్తే, అప్పుడు వచ్చి ఓటు వేస్తానని ఆయన చెప్పారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై పోరాడేందుకు వైఎస్సార్సీపీ కోర్టును ఆశ్రయిస్తుందని కూడా సూచించారు. ఇదిలా ఉండగా రఫీక్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పులివెందుల అర్బన్ పోలీసులు వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి , మరో 70 మందికి పైగా వ్యక్తులపై కేసు నమోదు చేశారు. నవంబర్ 1న పులివెందుల మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఎటువంటి ముందస్తు అనుమతి లేదని, ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
