అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వీడడం లేదు. పెద్ద ఎత్తున కురుస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో బాంబు పేల్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్ఎండీఏ) .రాష్ట్రంలోని అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది, రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బుధవారం నాటి తాజా అంచనా ప్రకారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలలో రాబోయే మూడు గంటల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వీటితో పాటు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కూడా ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
వర్షం తర్వాత ఉరుములు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఇవి రోజు వారీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయని హెచ్చరించింది. ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, అనవసరమైన ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని సూచించింది. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలు అత్యవసర పరిస్థితులను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అభ్యర్థించింది. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ఇదిలా ఉండగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం అయ్యింది సర్కార్. ఈ మేరకు విపత్తుల నిర్వహణ, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
